Date: 27-10-2021
ఆకివీడు అర్బన్ : కొత్తగా ఏర్పడిన ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించి మున్సిపాలిటీ కి మంచిపేరు తీసుకువద్దామని ఎన్నికల సహాయ అధికారిణి, ఇంచార్జి కమిషనర్ పెద్దిరెడ్డి సత్యవాణి పిలుపునిచ్చారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో బూత్ స్థాయి ఎన్నికల నిర్వహణపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ లో విశేష అనుభవం ఉన్న అధికారులంతా కొత్తగా ఏర్పడిన ఆకివీడు నగరపంచాయతి ఎన్నికల బాధ్యతలను నిజాయితీ, నిబద్ధతతో నిర్వహించేందుకు సహకరించాలన్నారు. ఎన్నికల కోడ్ ప్రకటించే సమయం ఆసన్నమైందన్నారు. ఏ విధమైన అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వాలంటీర్ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి బూత్ లు తనిఖీ చేయాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దన్నారు. 39 పోలింగ్ బూత్ లకు 5 టీమ్ లను ఏర్పాటు చేసి ప్రతి టీమ్ లో ఎన్నికల అధికారి, సహాయ అధికారి, అదనపు అధికారి ఉంటారని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు బూత్ లను పరిశీలిస్తుండాలని సత్యవేణి విజ్ఞప్తి చేసారు.