Date : 15-04-2021
అమరావతి : రాష్ట్రంలో 256.31 కి.మీ మేర జాతీయ రహదారుల విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. ఆరు ఎన్ హెచ్ లతో కొంత భాగాల మేర సమగ్ర ప్రాజెక్టు నివేదికలు గతంలోనే కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ కు అందచేయగా 2020-21కి సవరించిన వార్షిక ప్రణాళిక కింద రూ.1,784.59 కోట్లు కేటాయించారు. గత ఆర్ధిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31వ తేదీన వీటికి అనుమతులిస్తూ ఆదేశాలు వచ్చాయి. ఈ ఏడాది వీటికి టెండర్ లు పిలిచి, పనులు చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ రహదారులు అన్నింటిని రెండు వరుసలతో పది మీటర్ల మేర నిర్మిస్తారు.
వీటిలో పామర్రు - ఆకివీడు రహదారికి మాత్రం కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ టెండర్లు పిలవగా, వశిష్ఠ కన్స్ట్రక్షన్స్ పనులను దక్కించుకున్నట్టు ఇటీవల ఖరారు చేసారు. మిగిలిన ఐదు రహదారులకు ఆర్ అండ్ బి ఇంజినీర్లు టెండర్లు పిలువనున్నారు.
అన్ని బాధ్యతలు గుత్తేదారువే...
ఇప్పటి వరకు ఏదైనా జాతీయ రహదారి ప్రాజెక్టులో సివిల్ పనులు వరకు మాత్రమే టెండర్లు పిలిచి, గుత్తేదారులకు పనులు అప్పగించేవారు. ఆ మార్గంలో విద్యుత్ స్థంబాలు, పైప్ లైన్లు పక్కకు మార్చడం, భూసేకరణ జరిగిన స్థలంలో ఉండే నిర్మాణాల కూల్చివేతలు, తదితరాలన్నీ వేర్వేరు శాఖలతో జరిపించేవారు. తాజా ఆదేశాల ప్రకారం, రహదారి విస్తరణతో పాటు, ఆయా ఇతర పనులను కూడా కలిపి గుత్తేదారులకు పనులను అప్పగించనున్నారు.