ఆకివీడు : కృష్ణ, పశ్చిమ డెల్టాల నుంచి మురుగు నీటిని సముద్రంలో చేరవేసేందుకు సహజసిద్ధంగా ఆవిర్భవించిన ఉప్పుటేరు ముంపుటేరుగా మారింది. దీని పరీవాహికంలోని వందలాది గ్రామాలను ముంచెత్తుతుంది. వేలాది ఎకరాలను ఉప్పు నీటి కయ్యలుగా మార్చుతోంది. సుమారు 250 అడుగుల లోతు, 36 మైళ్ళ విస్తరణం 95 మీటర్ల నుంచి 114 మీటర్ల వెడల్పుతో 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో సహజ సిద్ధంగా ఆవిర్భవించింది. కొల్లేరులోని పందిరిపల్లిగూడెం వద్ద నుంచి గొల్లపాలెం వరకు ఇది విస్తరించి ఉంది. ఈ ఏరు జిల్లాలోని 32 గ్రామాలను తాకుతూ ప్రవహిస్తుంది. ఆకివీడు ప్రాంతంలో 32 గ్రామాలూ, భీమవరం పరిధిలో 20 గ్రామాలూ, ఈ ఏరు ప్రక్కనే ఉన్నాయి. కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 21 మేజర్, మైనర్ డ్రైయిన్ లు, మరో 40 కాలువలు ద్వారా వృధా నీరు ఉప్పుటేరు లో కలుస్తోంది. సాధారణ రోజుల్లో ఉప్పుటేరు ద్వారా 10 వేల క్రూసెక్కుల నీరు సముద్రం లోకి చొచ్చుకెళ్లుతుంది. వరదలు భారీ వర్షాల సమయంలో 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతుంది. ఉప్పుటేరు కుచించుకుపోవడంతో దాని ప్రవాహం సామర్థ్యం తగ్గిపోయింది. ప్రస్తుతం 12 వేల వేల క్రూసెక్కుల కంటే తక్కువగానే ప్రవహిస్తుంది.
ఆధునీకరణ ఊసే లేదు
ఉప్పుటేరు పూడికలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహం మందగించింది. ఆయా పంటా కాలువల నుంచి చొచ్చుకొస్తున్న మట్టి, చెత్త చెదారంతోపాటు, ఇతర వ్యర్ధాలు ఇక్కడ పేరుకుపోతున్నాయి. దీనికి తోడు కిక్కిస విపరీతంగా పెరిగింది. ఎప్పటికప్పుడు డ్రెడ్జింగ్ చేయించాల్సిన ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవడం లేదు. 50 ఏళ్ళు నుంచి ఉప్పుటేరులో పూడిక తీసిన దాఖలా లేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వం ఉప్పుటేరును తీవ్ర నిర్లక్ష్యం చెయ్యడంవల్లే ఫలితంగా ఉప్పుటేరు.. ముంపుటేరు గా మారిందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ళక్రితం ఉప్పుటేరుకు సర్వే చేయించారు. సర్వే కోసం రూ.60 లక్షలు వెచ్చించారు.
డ్రెడ్జింగ్ కోసం ప్రతిపాదనలు
గత ప్రభుత్వంలో ఉప్పుటేరు డ్రెడ్జింగ్ పనులకోసం రూ. 111కోట్లతో ప్రతిపాదనలను డ్రైనేజీ శాఖ అప్పటి ప్రభుత్వానికి పంపింది. అలాగే జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.38.5 కోట్లతో
ప్రతిపాదనను రూపొందించింది. నిధులు మంజూరు కాకపోవడంతో అవి బుట్ట దాఖలయ్యాయి.
సీమౌత్ వద్ద డ్రెడ్జింగ్ లేదు
ఉప్పుటేరు ముఖ ద్వారం సీమౌత్ వద్ద నిరంతర డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలని 1969లోనే మిత్ర కమిటీ సూచించింది. అప్పటినుండి ఇప్పటి వరకు అక్కడ పనులు జరిగిన దాఖలాలు లేవు. కొన్నాళ్లు ఒక డ్రెడ్జెర్ తో పనులు చేసారు. ఆ తరువాత డ్రెడ్జెర్ ను వేలం వేశారు. దింతో సీమౌత్ వద్ద పూడిక బాగా పేరుకుపోయింది. దింతో ఉప్పుటేరులోని నీటి ప్రవాహం ఎదురు ప్రవహిస్తుంది. వేసవిలో ఎదురు ప్రవాహం తీవ్రంగా ఉండి సరిహద్దు గ్రామాలలోని పంట, మురుగు కాలువల్లోకి చొచ్చుకువస్తుంది. ఆయా కాలువలకు ఉన్న షట్లర్లు కూడా బాగు చేయించడం, కొత్తవాటిని ఏర్పాటు చెయ్యడమనేది గత ప్రభుత్వం మరిచిపోయిందని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 1969లో వచ్చిన భారీ వరదలాగానే ఈ ఏడాది వర్షాలు కురవడంతో ఈ ప్రాంతం లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు ఉప్పుటేరు ఆవశ్యకత తెలిసి వచ్చింది.
వైస్సార్ తపన
ఉప్పుటేరు డెడ్జింగ్ పనులకు దివంగత ముఖ్యమంత్రి వై.ఏస్ రాజశేఖర్ రెడ్డి నిధులు కేటాయించారు. ఉప్పుటేరు ప్రక్షాళన చెయ్యాలని తపించారు. అప్పట్లో సుమారు అరా కిలోమీటర్ పనులు పూర్తి చేసారు. అయితే ఆ ఏడాదిలోనే ఆయన మృతి చెందడంతో డెడ్జింగ్ పనులు అటకెక్కాయి.
ముంపుతో అపార నష్టం
రెండు వారాల క్రితం కురిసిన కుండపోత వర్షానికి ఈ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. పంట పొలాలు నీట మునిగాయి. గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వందలాది చేపల చెరువులు, రొయ్యల చెరువులకు గండ్లు పడ్డాయి. అపార నష్టం వాటిల్లింది. సుమారు 300 కోట్ల మేర నష్టం ఉంటుందని అంచనా. ఇంతటి భారీ నష్టానికి ఉప్పుటేరుపై నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది.