Date : 19-08-2020
ఆకివీడు : కొల్లేరు సరస్సుకు లేకలేక జలకళ వచ్చింది. సముద్ర మట్టం నుంచి పదో కాంటూరు వరకు సహజ సిద్ధంగా విస్తరించిన ఈ మంచి నీటి సరస్సు ఇన్నాళ్లు ఆక్రమణదారుల హస్తాల్లో చిక్కుకుని కుచించుకుపోయింది. కేంద్ర సాధికార కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5వ కాంటూరు వరకు గుర్తించి, అభయారణ్యం గా గుర్తించారు. అభయారణ్యం ఆక్రమణలో నలిగిపోతూ అరణ్య రోదన చేస్తుంది. జల కళ లేక వెలవెలబోయింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో 5వ కాంటూరు ఉన్న కొల్లేరు సరస్సులోకి సుమారు 7 అడుగుల నీరు చేరింది. దింతో 5వ కాంటూరు ప్రాంతమంతా నీటితో కళకళలాడుతుంది. జూన్ నెలవరకు ఇక్కడ నీరు లేదు. పచ్చిక బైళ్ళు, పిచ్చమొక్కలతో కొల్లేరు కళవిహినంగా ఉండేది. ప్రస్తుతం కొల్లేరులోకి 12 వేళా క్యూసెక్కుల నీరు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు సరస్సు 1వ మైలు రాయి వద్ద ప్రస్తుతం 6.10 అడుగుల నీటి మట్టం ఉంది. ఆకివీడు ఉప్పుటేరు వంతేన వద్ద 5.6 అడుగుల నీటి మట్టం చేరింది. రోజు రెండు నుంచి మూడు అంగుళాల నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
కొల్లేరు సరస్సు ప్రాంతంలో 5వ కాంటూరు పరిధిలో జిరాయితీ భూములలో వేసిన చేపల చెరువులు తుడిచిపెట్టుకుపోయాయి. సుమారు 2 వేల ఎకరాల చేపల చెరువులు కనుమరుగయ్యాయి. దింతో చెరువులోని చేపలన్నీ కొల్లేటి పాలయ్యాయి 800 కోట్లు నష్టం వచ్చినట్టు సమాచారం.
కొల్లేరు లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 6.10 అడుగుల వరకు వరద నీరు చొచ్చుకొచ్చింది. రోజుకి రెండు అంగుళాలుపెరుగుతుంది. ఉప్పుటేరు నుంచి వరద నీరు సముద్రంలోకి చొచ్చుకువెళుతుంది. అప్పారావు, డీఈఈ, డ్రైనేజీ డివిజన్, ఉప్పుటేరు సబ్ డివిజన్, ఆకివీడు