ఆకివీడు : ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తుంటే అవినీతిపరులు అడ్డదారిలో సంపాదన కోసం అనంతకోటి ఉపాయాలు వెతుకుతున్నారు. దీనికి ఈ ఘటనే నిదర్శనం. ఆకివీడు మడివాడ ఎస్సీ పేటకు చెందిన బేతాళ సునీల్ కుమార్ ఈ నెల 9న ఆన్లైన్లో ఐదు యూనిట్ల ఇసుకను బుక్ చేసారు. దీనికి సంబంధించి రూ. 16,393 ఆన్లైన్లో చెల్లించారు. అయితే ఇసుక రాకపోవడంతో ఆన్లైన్లో ఇచ్చిన కొవ్వూరు డిపో మేనేజర్ నెంబర్ కు ఫోన్ చేసారు. డబ్బుల ఇస్తేనే ఇసుక వస్తుందని రూ.1700 ఇవ్వాల్సి ఉంటుందని అటు నుంచి సమాధానం వచ్చింది. దింతో అవాక్కయిన సునీల్ కుమార్ లారీ డ్రైవర్ కు ఇస్తానని అంగీకరించి ఇసుక పంపాలని కోరాడు. మంగళవారం ఇసుక దిగుమతి అయినా తరువాత లారీ డ్రైవర్ 1700/- ఇవ్వాలని డిమాండ్ చేసాడు. దింతో ఎందుకు ఇవ్వాలని సునీల్ కుమార్ అడుగగా డిపో మేనేజర్ మేనేజర్ చెప్పారని ఆయనతో మాట్లాడమని ఫోన్ చెయ్యమన్నాడు. అవతల వ్యక్తికి ఫోన్ చెయ్యగా డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఫోన్ వాయిస్ రికార్డు చేసిన దేవదాసు ఈ విషయం వైఎస్సార్ సీపీ మండల యువజన కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్ కు చేరవేశారు. అయన వచ్చి లారీ ని పోలీస్ స్టేషన్ కు పంపి, పిర్యాదు చేయించారు. ఓ వైపు ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే కొంతమంది అధికారులు ఇలా కమిషన్ కోసం కక్కుర్తి పడుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. లారీ డ్రైవర్ తో పాటు, డిపో లో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎసై వీరభద్రరావు తెలిపారు.