ఆకివీడు అభివృధికి నాంది
Date: 04-02-2020
Date: 04-02-2020
ఆకివీడు : జిల్లాలో ఆకివీడు, చింతలపూడి, అత్తిలి, ఆచంట, పెనుగొండ, చాగల్లు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా వర్గోన్నతి చేయాలనీ అధికారులకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఒక్క ఆకివీడు మేజర్ పంచాయతీని మాత్రమే నగర పంచాయతీగా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన పంచాయతీలకు ప్రస్తుతం ఆమోదం లభించలేదు. ఆకివీడు నగర పంచాయితీ కమిషనర్ నియమించడం తదితర పాలనాపరమైన పనులు శర వేగంగా సాగుతున్నాయి.
ఆకివీడు పంచాయతీ వివరాలు:
3,268 కిలోమీటర్లు, గ్రామా విస్తీర్ణం 20 వార్డులు, 32,412 మంది జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం), గ్రామంలో కుటుంబాలు : 8,156, గ్రామంలో నివాసాలు సుమారు :7,244, పంచాయతీ సాధారణ ఆదాయం : 1,87,55,737/-, వ్యవసాయ విస్తీర్ణం : 2,772.53 ఎకరాలు.
దశలవారీ అభివృద్ధి :
కొల్లేరు తీరప్రాంత గ్రామమైన ఆకివీడు పంచాయతీ 1919లో ఏర్పాటైంది. దశలవారీగా అభివృద్ధి చెందుతూ మేజర్ పంచాయతీగా కొనసాగింది. సుమారు 37 వేల మంది జనాభా నివసిస్తున్న ఆకివీడు లో 20 వార్డులు ఉన్నాయి. సుమారు 27 వేల మంది ఓటర్లు ఉన్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న ఆకివీడుకు నగర పంచాయతీ గా వర్గోన్నతి కలిపించాలని డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. ఎట్టకేలకు ప్రభుత్వం నగర పంచాయతీ హోదా కలిపించిది.
సమస్యల తిష్ట:
ఆకివీడు పంచాయతీ పరిధిలో అనేక దీర్ఘకాలిక సమస్యలు తిష్ట వేసిఉన్నాయి. పంచాయితీకి వార్షిక ఆదాయం సుమారు రూ.2 కోట్ల వరకు వస్తున్న అభివృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు వార్డుల పరిధి లో అంతర్గత రహదారులు, త్రాగునీరు, డ్రైనేజీ, ట్రాఫిక్ తదితర సమస్యలు స్థానికులను పట్టి పీడిస్తున్నాయి. నగర పంచాయతీ హోదా ద్వారా అధిక నిధులు వచ్చే అవకాసం ఉంది.
ప్రయోజనాలు ఇలా :
నిన్నటి వరకు మేజర్ పంచాయతీగా ఉన్న ఆకివీడుకి నగర పంచాయతీ హోదా కలిపించడం ద్వారా పట్టణీకరణతో మెరుగైన సౌకర్యాలు సమకూరనున్నాయి. నిధులు కేటాయింపులు పెరుగుతాయి. త్రాగు నీటి సరఫరా, పారిశుద్య నిర్వహణ మెరుగు పడుతుంది. రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతాయి. ప్రజలపై పన్ను భారం పడిన మౌలిక వసతులు సమకూరి పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది.
మౌలిక సౌకర్యాలు మెరుగుపడతాయి:
ఆకివీడు నగర పంచాయతీగ మారడంవల్ల మౌలిక సౌకర్యాలు సమకూరుతాయి, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకివీడు పట్టణంలో త్రాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ మెరుగు పడుతుంది. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా సాగుతుంది. ఉద్యానాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి సహకారంతో పట్టణం సర్వోతోముఖాభివృద్దికి కృషి చేస్తాను.