మండవల్లి - భైరవపట్నం (కైకలూరు) : పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పూరి – తిరుపతి రైలు (17479) ఉదయం 5.47 గంటలకు కైకలూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే మండవల్లి మండలం భైరవపట్నం గ్రామసమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీనిని గమనించిన రైల్వే కీమెన్ ఇంజన్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో రైలును భైరవపట్నం గ్రామసమీపంలోనే నిలిపివేశారు. అనంతరం కైకలూరు నుంచి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విరిగిన పట్టాకు మరమ్మతులు చేపట్టారు. తర్వాత 6.30 గంటలకు రైలు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ భైరవపట్నం గ్రామం వద్ద పట్టా విరగడం గమనార్హం. రైలు నిలిపివేయడంతో భీమవరం–విజయవాడ లైన్‌లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.