నరసాపురం: ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పు గోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేరి చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపయోగపడే విదంగా నరసాపురం నుంచి బెంగళూరుకు వారంలో రెండు రోజులు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వేశాఖ ప్రణాళిక సిద్దం చేసింది. వచ్చే నెల రెండో వారం నుంచి శని, అది వారాల్లో రైలు నడపడనికి అన్ని సిద్ధం చేసినట్టు రైల్వేశాఖ ఉన్నతాధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. 4 జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 బోగీలతో సాయంత్రం 4 గంటలకు నరసాపురం నుంచి రైలు బయలుదేరుతుందని తెలిసింది. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఇటీవల కాలంలో హైదరాబాద్ వెళ్లడానికి రైలు సర్వీసులు బాగా అందుబాటులోకి వచ్చాయి. కానీ బెంగళూరు వెళ్లడానికి నానా తిప్పలు పడుతున్నారు.
బెంగళూరు ప్రయాణానికి అవస్థలు:
డెల్టా నుంచి ఇటీవల బెంగళూరుకు రాకపోకలు సాగించే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పెద్దసంఖ్యలో ఇక్కడివారు బెంగళూరులో ఉన్నారు. ఇక వ్యాపార లావాదేవీలకు బెంగళూరుకు రాకపోకలు సాగించేవారి సంఖ్య కూడా గత ఐదేళ్లకాలంలో బాగా పెరిగింది. అయితే బెంగళూరు వెళ్లడానికి రైలు సర్వీసులు మాత్రం అందుబాటులో లేవు. పశ్చిమ డెల్టా వాసులు అయితే నరసాపురం నుంచి నడిచే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి చేరుకుని అక్కడి నుంచి వేరే రైళ్లు, బస్సులు తదితర మార్గాల్లో బెంగుళూరు వెళుతున్నారు. గత్యంతరంలేక మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా వారానికి నాలుగు రోజులు నడిచే కొండవీటి క్స్‌ప్రెస్‌ను లేదా కాకినాడ నుంచి నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇక్కడివారు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఈ రైళ్లు ఎక్కవలసివస్తుంది. ఇక్కడి నుంచి వారానికి రెండు రోజులపాటు బెంగళూరుకు రైలు నడపాలని రైల్వేశాఖ చేస్తున్న యోచనపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.