ఆకివీడు: రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప వద్ద ఉప్పుటేరుపై నిర్మించిన రైల్వే వంతెన సామర్ధ్యాన్ని బుధవారం రైల్వే అధికారులు పరిశీలించారు. సుమారు 350 టన్నుల బరువు గలిగిన పట్టాన్ని, వంతెనపై 24 గంటల పాటు ఉంచారు. వెయిట్ బేరింగ్ టెస్ట్ లో భాగంగా 7 రైలు ఇంజన్ల బరువు గల పట్టాల్ని వంతెనపై ఉంచారు. 24 గంటల వరకూ ఏ విధమైన లోపాలు కనిపించలేదని రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. వంతెన సామర్థ్యం సంతృప్తికరంగా ఉండటంతో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
నెలాఖరులో డబల్ లైన్లపై పుట్లచెరువు వద్ద నుండి ఆకివీడు వరకూ రైళ్లు నడుపుతామని రైల్వే జనరల్ మేనేజర్ ఇటీవల ప్రకటించారు. అయితే మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో ఏప్రిల్ మొదటి వారంలో డబ్లింగ్ లైన్లపై రైళ్లు నడిపే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయవాడ - నరసాపురం - నిడదవోలు ,విజయవాడ - గుడివాడ - మచిలీపట్టణం డబ్లింగ్, విద్యుతికరణ పనులు కొన్ని ప్రాంతాల్లో నత్తనడకన కొనసాగుతుంటే, మరి కొన్నిచోట్ల అసలు పనులు మొదలు పెట్టలేదు. దీంతో 2020 నాటికి డబ్లింగ్ పనులు పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.